Sunday, September 15, 2013

చిల్లర దేవుళ్ళు


పనిలో చాలా తీరిక లేకుండా ఉన్న నేను ఈ వారంతం లో ఏదైన తెలుగు పుస్తకం చదువుదామని అంతర్జాలం లో వెతుకులాట మొదలెట్టా. వెంటనే నా చిన్నప్పుడు వార్త అనే తెలుగు వార్త పత్రిక ఆదివారం సంచికలో వచ్చే జీవన యానం అనే శీర్షిక, దానిని రాసిన దాశరథి రంగాచార్య గుర్తుకు వచ్చారు. నా చిన్నతనం లో తాతయ్య జీవనయానం శీర్షిక కోసం వారమంతా చూసే వారు. ఆదివారం రాగానే మొదట  దాన్ని చదవడం పూర్తీ చేసి మిగితా పనులు చేసేవారు. దాశరథి రంగాచార్య గారిది ఖమ్మం దెగ్గర్లొ ఒక గ్రామమని, రజాకర్ ఉద్యమంలో పాలుపంచుకున్నారని, వారి అన్న గారైన దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి  గా సినీ గేయ రచయతగా చిరపరిచితులని, చిన్నప్పుడే తాతయ్య దెగ్గర విన్న జ్ఞాపకం. జీవనయానం పుస్తకం లో మా వూరి ప్రస్తావన చాలా సార్లు వచ్చింది.  దాశరథి  గారి రచన ఏమైనా దొరుకుతుందేమో అని కినిగే లో వెతిక ఏమి లాభం లేక పోయింది, వెతగ్గా,వెతగ్గా స్క్రిబ్ద్ లో అయన రాసిన చిల్లర దేవుళ్ళు అనే నవల కనిపించింది. 170 పేజి లను ఏకదాటిగా 3 గంటల్లో పూర్తిచేసా. ఆ పుస్తకం గురించి కొన్ని మాటలు.

సారంగపాణి అనే సంగీత విద్వాంసుడు ఉదర పోషకార్దమ్  రెడ్డి గారు అనబడే రామి రెడ్డి అనే ఒక గ్రామా పెద్ద (దేశముఖ్ )   దెగ్గరికి రావడం తో కథ మొదలవుతుంది. నిజాం ప్రభువులు రాజ్యనేలుతున్న కాలమది. దేశ్ముఖ్, కరణం, పటేలు వీరి ఆగడాలకు అంతే లేకుండా పల్లెలని తమ గుప్పిట్లో ఉంచుకొని గ్రామా గ్రామాన వారే పెత్తనం చలాయించే రోజులవి. విజయవాడ నుండి వచ్చిన సారంగపాణి  కి ఈ విషయాలన్నీ కొత్తగా కొంచెం వింతగా అనిపిస్తాయి. రెడ్డి గారి ఇంట్లో వనజ అనే ఒక దాసీ సారంగపాణి కి అన్ని అమర్చి పెట్టేది, ఆ అమ్మాయి అణకువ ని చూసి ఇష్టపడతాడు పాణి. పాణి కరణం ఇంట్లో ఉండే కూతురు తాయారు కి, నారయ్య కూతురు లక్ష్మి కి సంగీతం నేర్పిస్తుంటాడు. రెడ్డి కూతురు మంజరి.మంజరి, తాయారు పాణి ని ఇస్తా పడుతుంటారు.   వనజ కి కూడా పాణి అంటే ఇష్టం ఉంటుంది కాని తనుదాసి, తన ఇష్టం తో ఎవరికీ పని లేదు, చిన్నపడి నుంచి తను అలాగే పెరిగింది, తన అభిప్రాయాలకు విలువ లేకుండా. వనజ తానంటే ప్రేమగా ఉండే పాణి ని ఇష్టపడుతున్నా, అది అన్న-చెల్లి బంధం  అని, తనలాంటి వ్యక్తి పాణి లాంటి మంచి వారికి భార్యనయ్యే అర్హత లేదని పాణి తో చెప్తుంది. ఇది తెలియని మంజరి వనజ మీద ద్వేషం పెంచుకుంటుంది. మరో వైపు తాయారు పాణి ని తనని పెళ్ళి చేసుకోమని లేదంటే ఊరు లోనే లేకుండా చేస్తా అని బెదిరిస్తుంది. తాయారు లో ప్రేమ లేదని, ఆమె వ్యక్తిత్వం కూడా  సరిగా లేదని అనుకుంటాడు పాణి. ఇంతలో మంజరి అరోగ్యం పాడవుతుంది, పాణి ఎక్కడ టానికి దక్కడనే బెంగ తో. ఇదిలా జరుగుతుండగా ఒకానొక హత్యా నేరం నుంచి బయటపడడానికి రెడ్డి, కరణం సాయం కోరతాడు.సాయం చేయాలంటే తన కూతురు తాయారు కి పాణి తో వివాహం జరగాలని కరణం రెడ్డి ని కోరతాడు. పాణి దగ్గర మాట తీసుకొని విషయం చెప్తాడు రెడ్డి, పాణి తనకి తాయారు తో వివాహం  ఇష్టం లేదని అది కాకుండా తన ప్రాణాలైన ఇస్తానంటాడు. దాంతో రెడ్డి పాణి ని ఊరు నుండి వెళ్ళిపో అంటాడు. ఈ విషయాలన్నీ కుదుట పడక రెడ్డి ఆరోగ్యం  దెబ్బతింటుంది, పట్నం తీసుకు వెళ్దాం అని బయలు దేరతారు వనజ, మంజరి, రెడ్డి భార్య అలా చెన్న పట్నం వెళ్ళిన రెడ్డి కుటుంబానికి పాణి ఆశ్రయం కల్పిస్తాడు. చివరగా మంజరి పాణి మరదలని, చిన్నప్పుడు తప్పి పోయిన రెడీ చెల్లెలి కొడుకని తెలిడంతో కథ సుఖాంతం అవుతుంది.
మొత్తం గా చుస్తే అదే కథ కాని రంగాచార్యులు కథలో ఆ సమయం లో తెలంగాణా లో ఉన్న దొరల అరాచకాలు, కరణం లాంటి వాళ్ళు చేసే కబ్జాలు, దాసీ వ్యవస్థ, మాట మార్పిడులు, నిజం పోలీస్ దౌర్జన్యాలు, లంబాడి ప్రజల  కష్టాలు క్లుప్తం గా వివరించారు. 

పాణి హైదరాబాద్ వచ్చిన సందర్భం లో ఆంధ్ర మహా సభ, ఆర్య సమాజ్ గురించిన ప్రస్తావన ఆనాటి స్తితిగతులని వివరించే ప్రయత్నం లా అనిపించింది. ఆనాటి మేధావుల విశాలాంధ్ర  అలోచన, నిజాం రాజ్యం లో పోలీసుల అకృత్యాలు కథలో అంతర్లీనంగా కనిపిస్తాయి. కృష్ణమాచార్యుల యాత్ర స్మృతి చదివినప్పుడు కలిగిన ఒక భావం మాత్రం నాకు కనిపించింది, తెలంగాణా ప్రజల్లో అప్పటికి ఆత్మ న్యూనత భావం ఎక్కువగా ఉండేదని.

మొత్తానికి ఈ వారంతం లో పనితో పాటు ఒక మంచి పుస్తకం చదవడం పూర్తి చేశా (దాని గుర్చిన విశేషాలని ఇక్కడ పొందు పరచడం తో సహా )



No comments: